: నేరస్థులను బరిలో దింపడంలో కాంగ్రెస్.. బీజేపీ పోటాపోటీ
కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకే తాను ముక్కలు. చెప్పేవి నీతులు.. చేసేవి చెత్త పనులు అన్నట్లుంది ఈ రెండు పార్టీల చర్యలు. రాజకీయాలను శుద్ధిచేసి నేరరహితంగా మారుస్తానంటాడు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ. ఆ పని తామే చేయగలమని జబ్బలు చరిచి మరీ చెబుతారు బీజేపీ నేతలు. కానీ ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న పలు రాష్ట్రాలలో ఈ రెండు పార్టీలు రంగంలోకి దింపిన అభ్యర్థుల నేర చరిత్ర చూస్తే చాలు.. ఈ పార్టీల నగ్న చిత్తశుద్ధి బయటపడుతుంది.
మధ్యప్రదేశ్ లో 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్ర నేరాభియోగాలను ఎదుర్కొంటున్న 15 మందికి టికెట్లిచ్చింది. ఈ సారి ఎన్నికల్లో ఆ సంఖ్యను కాస్త పెంచి 22 మందిని బరిలో నిలిపింది. బీజేపీ 2008లో 10 మందికి ఇస్తే.. ఇప్పుడు 16 మంది నేరచరితులను పోటీకి దింపింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ ఏడుగురికి, బీజేపీ 10 మంది నేరచరితులకు టికెట్లిచ్చాయి. ఢిల్లీలో అయితే, కాంగ్రెస్ 11 మంది, బీజేపీ భారీగా 32 మందిని ఎన్నికల యుద్ధంలోకి దింపాయి. రాజకీయాలను నేరరహితం చేస్తామంటున్న ఈ రెండు పార్టీల నిజస్వరూపానికి ఈ గణాంకాలే నిదర్శనం.