: విభజనపై ఉన్న శ్రద్ధ ప్రజలను ఆదుకోవడంలో లేదు : చంద్రబాబు
రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు చూపుతున్న ఉత్సాహం ప్రజలను ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. వరుసగా మూడు తుపానులు రాష్ట్రంపై దాడి చేస్తున్నా తుపాను నష్టాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బాబు మండిపడ్డారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.
హెలెన్ తుపాను వల్ల వచ్చిన నష్టాన్ని ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రధాని కనీసం పరామర్శించేందుకు కూడా రాలేదని ఆరోపించారు. వెయ్యి కోట్లు ఇస్తామని హామీ ఇస్తే సరిపోయిందా? నెరవేర్చాల్సిన బాధ్యత లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
ప్రభుత్వం సకాలంలో నీరు అందించని కారణంగా లక్షలాది ఎకరాల్లో పంట నాశనమైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ఎందుకు ప్రకటించలేదని బాబు నిలదీశారు. వరుసగా మూడు తుపానులు రాష్ట్రం మీద దాడి చేస్తే ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా? అని సూటిగా అడిగారు. కనీసం ముఖ్యమంత్రి కూడా ప్రజలను పరామర్శించేందుకు రాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.