: తేజ్ పాల్ వ్యవహారం బయటపడినందుకు సంతోషిస్తున్నా: బంగారు లక్ష్మణ్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 'తెహల్కా' మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ వ్యవహారంపై బీజేపీ నేత బంగారు లక్ష్మణ్ స్పందించారు. ఎట్టకేలకు తేజ్ పాల్ వ్యవహారం బయటపడినందుకు సంతోషిస్తున్నానని అన్నారు. తేజ్ పాల్, ఆశారాంను ఒకే జైల్లో పెట్టాలని, ఎలాంటి అదనపు సౌకర్యాలు కల్పించకూడదన్నారు. ఇతరులపై శూల శోధన (స్టింగ్ ఆపరేషన్) చేసేందుకు తేజ్ పాల్ అమ్మాయిలను కూడా ఉపమోగించుకున్నాడని అన్నారు. హక్కుల గురించి మాట్లాడే అధికారం అతనికి లేదన్నారు. ఎక్కువకాలం అతను జైల్లోనే ఉండాలని లక్ష్మణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
రక్షణ ఒప్పందంలో భాగంగా బంగారు లక్ష్మణ్ ఒకరి నుంచి లక్ష రూపాయలు తీసుకుంటున్నట్లు... 'ఆపరేషన్ వెస్ట్ ఎండ్' కింద 2000-01లో 'తెహల్కా' నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బయటపడింది. దాన్ని ఆ మ్యాగజైన్ బయటపెట్టడంతో దేశ వ్యాప్తంగా సంచలనం చెలరేగింది. దాంతో, లక్ష్మణ్ కు 2012లో ఢిల్లీ హైకోర్టు శిక్ష విధించింది. అనంతరం ఆనారోగ్య కారణాల వల్ల కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడంతో ప్రస్తుతం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.