: మోడీ కుర్చీ కోసం నేతల పోటీ... లక్షలకు చేరిన వేలం పాట
అభిమానం ఎంతటి పనైనా చేయిస్తుందనేది బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ విషయంలో జరిగింది. ఉత్తరాదిన జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఈ నెల 21న ఆగ్రాలో నిర్వహించిన ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వేదికపై నరేంద్ర మోడీ కూర్చున్న ఛైర్ ను సొంతం చేసుకునేందుకు బీజీపీ నేతలు పోటీ పడ్డారు. చివరకు దీనికి సంబంధించి చిన్నపాటి వేలంపాట కూడా చోటుచేసుకుంది. ఇప్పటిదాకా బీజేపీ ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గ్ ఈ ఛైర్ కోసం లక్షా 25 వేల రూపాయల వరకు వేలంపాట పాడారు. ఇతని వెనుక మరో ముగ్గురు నేతలు దాదాపు లక్ష రూపాయల వరకు వచ్చి క్యూలో ఉన్నారు. ఈ వివరాలు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకు పొక్కాయి.
మరింత లోతుగా వెళ్తే, ప్రమోద్ ఉపాధ్యాయ అనే బీజేపీ కార్పొరేటర్ (కాంట్రాక్టర్ కూడా) ఈ ర్యాలీకి సంబంధించిన ఫర్నిచర్ ను సమకూర్చారు. ర్యాలీ అనంతరం ఓ పార్టీ కార్యకర్త... మోడీ కూర్చున్న ఛైర్ ను 2 వేల రూపాయలకు అమ్మాల్సిందిగా ప్రమోద్ ను అడిగాడు. ఇది పార్టీకి సంబంధించిన ఇతర నాయకుల దృష్టిని కూడా ఆకర్షించింది. వారు కూడా దీన్ని సొంతం చేసుకోవాలని భావించారు. అంతే, చాలా విచిత్రంగా ఇది వేలంపాటకు దారి తీసింది.