: వినబడడం లేదా ... అయితే ఒళ్ళు బరువెక్కినట్టే!


మామూలుగా బరువు పెరిగితే పలు రకాల రోగాలు వస్తాయని మనందరికీ తెలుసు. అందుకే పెరిగిన బరువును తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతుంటాం. అయితే బరువు పెరిగితే కేవలం అనారోగ్యమేకాదు... చెవుడు కూడా వస్తుందట. శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించారు. ఇలాంటి సమస్య ఎక్కువగా మహిళల్లో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బ్రిగ్హామ్‌ అండ్‌ విమెన్స్‌ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు 68,421 మంది మహిళలకు సంబంధించిన బీఎంఐ, నడుము చుట్టుకొలత, శారీరక వ్యాయామం, వినికిడి లోపం వంటి అంశాలను తమ అధ్యయనంలో భాగంగా విశ్లేషించారు. ఈ విశ్లేషణలో అధిక బరువు ఉండే మహిళల్లో వినికిడి లోపం ఉన్నట్టు గుర్తించారు. అధిక బీఎంఐ, నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉండడానికి, వినికిడి లోపానికి సంబంధం ఉందని, శారీరక వ్యాయామం అధిక స్థాయిల్లో ఉండే మహిళల్లో ఈ సమస్య తక్కువగా ఉంటోందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. ఈ సమస్యను వ్యాయామం ద్వారా తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఆరోగ్యకరమైన బరువుతో ఉండడం, శారీరకంగా చురుగ్గా ఉండడం వంటి అలవాట్ల ద్వారా వినికిడి లోపాన్ని నివారించడంగానీ, తీవ్రతను ఆలస్యం చేయడంగానీ సాధ్యమవుతుందని తమ అధ్యయనాల్లో వెల్లడైందని పరిశోధకులు షరోన్‌ కుర్హాన్‌ తెలిపారు. వారానికి రెండు గంటలపాటైనా నడిచిన మహిళల్లో వినికిడి లోపం ముప్పు 15 శాతం తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు.

  • Loading...

More Telugu News