: ప్రయాణీకుల చెంతకు రైలు సమాచారం.. జీపీఎస్ తో ఎంఎంటీఎస్ అనుసంధానం
హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త. ట్రైన్లు ఎక్కడున్నాయో, ఎంత సేపటికి స్టేషన్ కు చేరుకోనున్నాయో వంటి విషయాలు నేరుగా ప్రయాణీకులు తెలుసుకునే సౌలభ్యాన్ని రైల్వే శాఖ కలుగజేయనుంది. సిటీలోని 27 స్టేషన్లలో 121 ట్రిప్పుల మేర తిరుగుతున్న ఎంఎంటీఎస్ సర్వీసులను జీపీఎస్ కు అనుసంధానించనున్నారు. దీని ద్వారా రైలు ఎక్కడుంది అనే విషయాన్ని ప్రయాణికులు మొబైల్ ద్వారా తెలుసుకునే వీలు ఉంటుంది. అంతేకాకుండా, రైలు ఎంత సేపట్లో స్టేషన్ కు చేరుకుంటుందనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు.
ఫలక్ నుమా-లింగంపల్లి రూటులో తొలిసారిగా ఈ పద్దతిని ప్రవేశపెడుతున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే రైళ్ల కదలికలను స్టేషన్లలోని టీవీల ద్వారా చూపించనున్నారు. ఇందుకు స్టేషన్లలోని అన్ని ఫ్లాట్ ఫాంలపై టీవీలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రయాణీకులకు సమాచారాన్ని అందించనున్నారు. ఈ వ్యవస్థ ప్రయాణీకులకు ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.