: బరువు తక్కువగా ఉంటే అన్నీ సమస్యలేనట


బరువు తక్కువగా ఉంటే మంచిదేకదా అనుకుంటున్నారా... ఇది పుట్టే బిడ్డల విషయంలో. అప్పుడే పుట్టిన బిడ్డలు ఉండాల్సిన బరువుకన్నా తక్కువ బరువుతో పుడితే ఆ బిడ్డలు అన్నీ సమస్యలే ఎదుర్కొనాల్సి వస్తుందట. మామూలుగా ఉండాల్సిన బరువుతో పుట్టిన పిల్లలతో పోలిస్తే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు అన్ని విషయాల్లోనూ వెనుకబడే ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు.

ఒటాగో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు తర్వాత కాలంలో పెద్దగా పొడుగు పెరగరని, వారికి స్నేహితులు కూడా తక్కువగానే ఉంటారని, అలాగే చదువు తదితర విషయాల్లో కూడా తమ వయసు వారితో పోలిస్తే చాలా వెనకబడి ఉంటారని వెల్లడైంది. ఇందుకుగానూ పరిశోధకులు అతి తక్కువ బరువుతో పుట్టి, ఇప్పుడు 22-23 సంవత్సరాల వయసు వచ్చిన వారిని తమ అధ్యయనానికి ఎంపిక చేసుకున్నారు. వారినుండి సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తే వారికున్న స్నేహితులు, ఇతర పరిచయస్తుల సంఖ్య కూడా చాలా పరిమితమని తేలింది.

అంతేకాదు, విద్యకు సంబంధించి కూడా వారి తెలివితేటలు అంతంతమాత్రమేనని తేలింది. ఉన్నత పాఠశాల స్థాయికి వచ్చిన తర్వాత కూడా వారు పోటీల్లో పాల్గొంటున్న తీరు చాలా నిరాశాజనకంగా ఉందని, వారికి వచ్చిన ఉద్యోగాలు, పొందుతున్న వేతనాలు కూడా అదే వయసుగల ఇతర పిల్లలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి గర్భంతో ఉన్న తల్లులు తమ పిల్లలు సరియైన బరువు పెరుగుతున్నారో లేదో చక్కగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

  • Loading...

More Telugu News