: ఇలాకూడా విడాకులు అడుగుతారా!
సాధారణంగా భార్యాభర్తల బంధం విడిపోవడానికి పలు కారణాలను చెబుతుంటారు. చిన్న చిన్న కారణాలుగా మనం చెప్పుకునేవి విడిపోయేవారి దృష్టిలో పెద్ద కారణాలుగా కనిపిస్తాయి. ఇలాంటి వాటిలో పొగతాగడం ఒకటి. సాధారణంగా భర్తలు పొగతాగుతుంటే దానివల్ల ఇబ్బందికి గురయ్యే సౌదీ మగువలు తమ భర్తలనుండి విడాకులను పొందవచ్చని గత ఏడాది ఒక న్యాయమూర్తి రూలింగ్ ఇచ్చారు. అదే భార్యలు పొగతాగితే... అని ఆలోచించాడో ఏమో తన భార్య పొగతాగుతుందని ఆరోపిస్తూ భార్యనుండి విడాకులు కోరాడు ఒక ప్రబుద్ధుడు.
పెళ్లైన ఆనందం మూడు నెలలు కూడా పూర్తిగా లేకుండానే సౌదీలోని దక్షిణ నగరం జిజాన్‌కు చెందిన ఒక ప్రబుద్ధుడు కేవలం భార్య హ్యాండ్‌బ్యాగ్‌లో సిగరెట్ పెట్టెను చూసి తనకు తన భార్యనుండి విడాకులు కావాలని కోర్టుకెక్కాడు. అయితే తన హ్యాండ్‌బ్యాగ్‌లోని సిగరెట్ తనది కాదని, తనకు పొగతాగే అలవాటు లేదని ఆ భార్య ఎంతగా మొత్తుకున్నా పట్టించుకోకుండా, తన భార్య సిగరెట్ తాగుతుందని, ఆ సిగరెట్ ఆమెదేనని వాదిస్తూ చివరికి విడాకులు తీసుకున్నాడు సదరు భర్త. ఆ వ్యక్తికి నచ్చజెప్పేందుకు రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలం కావడంతో చేసేదిలేక కోర్టు కూడా విడాకులు మంజూరుచేసింది. సౌదీలో ఆరు లక్షలమంది మగువలు పొగ తాగుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇది ఆ దేశంలో పొగతాగే వారిలో పదోవంతు.