: ప్రజలకు, సహచరులకు, అధికారులకు కృతజ్ఞతలు: సీఎం కిరణ్
ఆర్థిక పరిస్థితులు, శాంతిభద్రతలు దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించానని ముఖ్యమంత్రి కిరణ్ తెలిపారు. ముఖ్యమంత్రిగా మూడేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న ఆయన... హైదరాబాద్ లోని సీఎం క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా మూడేళ్లపాటు మంచి పరిపాలన అందించడానికి సహకరించిన సహచరులు, అధికారులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. మూడు సంవత్సరాలపాటు తనను ముఖ్యమంత్రిగా ఆదరించినందుకు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ మూడేళ్ల కాలంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని సంక్షేమ కార్యక్రమాలను అందించగలిగామని అన్నారు. రూ. 9 వేల కోట్లను సంక్షేమ పథకాల కోసం కేటాయించామని అన్నారు.
ప్రకృతి విపత్తుల వల్ల రైతులు చాలా నష్టపోయారని సీఎం కిరణ్ అన్నారు. వారికి ప్రభుత్వం నుంచి వడ్డీ లేని రుణాలను అందించామని చెప్పారు. వడ్డీని ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. రైతులకు ఈ ఏడాది రూ. 1260 కోట్ల వడ్డీలేని రుణాలను అందించామని చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా సంక్షేమం విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తేలేదని అన్నారు. విద్యా రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని... యువతకు ఉపాధి అవకాశాలు పెంచామని తెలిపారు. అనేక సమస్యలున్నా పారిశ్రామిక రంగంలో పురోభివృద్ధి సాధించామని సీఎం అన్నారు. విద్యుత్ ఉత్పాదనలో కొంత వెనకబడ్డ విషయం నిజమేనని... కేంద్రం నుంచి రావాల్సిన గ్యాస్ రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.