: ఎన్నో మలుపులు.. మరెన్నో చిక్కుముళ్లు.. ఇదీ ఆరుషి హత్య కేసు!
దేశంలో సంచలనం సృష్టించిన టీనేజర్ ఆరుషి తల్వార్ హత్యకేసు ఎన్నో మలుపులు తిరిగింది. మరెన్నో సంవత్సరాల సుదీర్ఘ విచారణ తరువాత ఎట్టకేలకు హంతకులను కోర్టు నిర్థారించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే, 2008 మే 16న ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జలవాయువిహార్, సెక్టార్ 25లో డాక్టర్ రాజేష్ తల్వార్ కుమార్తె దారుణ హత్యకు గురైందన్న వార్త గుప్పుమంది. ఆరుషి హత్య వెలుగులోకి వచ్చిన వెంటనే మీడియా శూలశోధనలో పని మనిషి కనిపించడం లేదన్న నిజం వెలుగులోకి వచ్చింది.
దీంతో ఆరుషిని బలవంతం చేసిన పని మనిషి హేమరాజ్... ఆరుషి ఒప్పుకోకపోవడంతో హత్యకు పాల్పడ్డాడంటూ మీడియా కథనాలు ప్రసారమయ్యాయి. హంతకుడిగా హేమరాజ్ ను నిర్థారించిన మీడియాకు మరుసటి రోజే టెర్రేస్ మీద హేమరాజ్ విగతజీవిగా కనిపించాడు. దీంతో కేసు మరో మలుపు తిరిగింది. అప్పటి వరకు పనిమనిషే హత్యకు పాల్పడ్డాడని ఊహించిన పోలీసులు, మీడియా అసలేం జరిగి ఉంటుందని మరింత లోతుగా అధ్యయనం చేశారు.
దీంతో ఆరుషికి, హేమరాజ్ కు అక్రమసంబంధం ఉందని... ఆ సంబంధాన్ని అంగీకరించని కుటుంబ సభ్యులే వారిద్దరినీ హతమార్చారని ఒక వాదాన్ని తెరమీదికి తీసుకువచ్చారు. మరో వైపు హేమరాజ్ బంధువులు రాజేష్ తల్వార్ క్లినిక్ లో పనిచేసే మరో ఇద్దరిపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. వారిద్దరూ ఆరుషి మీద కన్నేసి, ఇంటిలోకి దూరి అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె ఒప్పుకోకపోవడంతో హత్య చేశారని... ఆ హత్యను చూశాడని హేమరాజ్ ను కూడా హత్య చేశారని అనుమానం వ్యక్తం చేశారు.
ఆరుషి తల్లిదండ్రులు కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ప్రాథమిక విచారణ అనంతరం, అప్పటి ఐజీ మాత్రం 'ఇది ముమ్మాటికీ ఆరుషి తల్లిదండ్రుల పనే' అని, పరువు హత్య జరిగిందనీ ప్రెస్ మీట్ పెట్టి మరీ స్పష్టం చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఐజీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అతన్ని బదిలీ చేసి కేసును సీబీఐకి బదలాయించింది. కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ అరుణ్ కుమార్ నేతృత్వంలోని విచారణాధికారులు... ఆరుషి తల్లిదండ్రులకు ఏ పాపం తెలియదని పేర్కొన్నారు. కృష్ణ, రాజ్ కుమార్,విజయ్ మండల్ అనే ముగ్గురు పనివాళ్ళే ఈ హత్యలు చేశారని తేల్చారు. ఆరుషి తల్లిదండ్రులకు క్లీన్ చిట్ ఇచ్చారు. అలాగే, ఆ పనివాళ్ళు చేసిన హత్యలకు సాక్ష్యాలు కూడా లేవంటూ చార్జ్ షీట్ కూడా వేయలేదు. తర్వాత కొన్నాళ్ళకు ఆరుషి ప్రైవేట్ పార్ట్స్ కు సంబంధించిన వైద్య పరీక్షల నివేదికలు మిస్ అవడంతో, సీబీఐ డైరెక్టర్ కొత్త విచారణాధికారులను నియమించారు. జాయింట్ డైరెక్టర్ జావేద్ అహ్మద్ నేతృత్వంలోని ఇన్వెస్టిగేషన్ టీం చేబట్టిన విచారణలో పలు ఆసక్తికర అంశాలను తెలుసుకుంది.
ఈ క్రమంలో తొలుత పని మనుషులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ఆలోచించి వారికి నార్కో టెస్టులు కూడా నిర్వహించింది. ఆ టెస్టు వివరాలను నిందితుల తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించి వారిని నిర్దోషులుగా తేల్చారు. తదనంతర విచారణలో 14 ఏళ్ల ఆరుషిని ఆమె తండ్రి రాజేష్ తల్వార్ హత్య చేయగా, తల్లి నుపుర్ తల్వార్ సాక్ష్యాలను తారుమారు చేసిందని సీబీఐ నిర్థారించింది.
సీబీఐ సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం నేడు వారిద్దరినీ హంతకులుగా నిర్ధారించింది. ఈ హత్యాకేసుకు సంబంధించి శిక్షలపై రేపు కీలక తీర్పు వెలువడనుంది. దీంతో ఐదున్నరేళ్లుగా కోర్టులో నలుగుతున్న సంచలన కేసుకు తెరపడనుంది.