: కడుపులో కత్తెర పెట్టి కుట్టేసిన డాక్టర్లు
బ్రహ్మచారి సినిమాలో కమల్ హాసన్ కడుపులో వాచ్ మర్చిపోయి కుట్టేస్తుంది సిమ్రాన్.. అక్కడ్నుంచి ఆమె తిప్పలు మొదలై ప్రేమలో పడిపోతుంది. ప్రేమ సంగతి ప్రక్కన పెడితే అలాంటి ఘటనే విశాఖలో చోటు చేసుకుంది. రోగి కడుపులో కత్తెర మర్చిపోయి కుట్టేసిన వైనం వెలుగు చూసింది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం పుచ్చలపాడుకు చెందిన పాలవలస మోహనరావు(55) ప్లంబింగ్ పనులు చేసుకుంటూ విశాఖలో నివాసముంటున్నాడు.
2012లో పనులకోసం గోవాకు వలస వెళ్లాడు. అక్కడ ఈ ఏడాది ఏప్రిల్ 2న పొట్టకు గాయమైంది. దీంతో గోవాలోని బాంబోలిన్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఏప్రిల్ 3న అతనికి శస్త్రచికిత్స నిర్వహించారు అక్కడి వైద్యులు. ఈ నెల మొదటి వారంలో కడుపునొప్పి రావడంతో గోవా నుంచి విశాఖకు బయలు దేరిన మోహనరావు, కేజీహెచ్ లో జాయిన్ అయ్యాడు.
ఎక్స్ రే తీయగా కడుపులో కత్తెర ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. తక్షణం అతనికి శస్త్రచికిత్స నిర్వహించి కడుపులో ఉన్న కత్తెరను వెలికి తీశారు. ప్రస్తుతం మోహనరావు కోలుకుంటున్నాడు. కాగా కత్తెరను చూపించేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారని బాధితుడి భార్య మీనాక్షి తెలిపారు. కనీసం ఎక్స్ రే అయినా ఇవ్వాలని కోరగా ఇది ఎంఎల్ సీ కేసని వీటిని కోర్టుకు మాత్రమే అందిస్తామని వైద్యులు చెప్పారని ఆమె తెలిపింది.
దీనిపై కేజీహెచ్ వైద్యులు మాట్లాడుతూ శస్త్రచికిత్స చేసేటప్పుడు రక్తస్రావం అడ్డుకునేందుకు రెండు రకాల ఫోర్ సెప్స్ ను సాధారణ సర్జన్లు ఉపయోగిస్తారని, మోహనరావుకు గోవా వైద్యులు శస్త్రచికిత్స చేసే సమయంలో కర్వడ్ ఆర్టరీ ఫోర్ సెప్స్ ను ఉపయోగించారని తెలిపారు. అయితే చికిత్స అనంతరం కుట్లు వేసే సమయంలో వాటిని తొలగించాల్సి ఉండగా పొరపాటున ఒకదాన్ని మర్చిపోయారని, ఈ విషయాన్ని నర్సులు కూడా గమనించకపోవడం తప్పేనని అన్నారు.
దీంతో మోహనరావు పేగులన్నీ ఫోర్ సెప్స్ కు మెలిపడి ముద్దగా తయారై దెబ్బతిన్నాయని, దీంతో పరిస్థితి విషమించిందని తెలిపారు. అయితే పేగుల చుట్టూ పాడైన మాంసాన్ని తొలగించి కుట్లు వేశామన్న డాక్టర్లు, మరో 72 గంటలు గడిస్తే కానీ పరిస్థితిపై పూర్తి అంచనాకు రాలేమన్నారు. ఆపరేషన్ అనంతరం అతని కడుపులోంచి తీసిన ఆరు అంగుళాల ఫోర్ సెప్స్, ఎక్స్ రేను భద్రపరిచామని వారు వెల్లడించారు.