: మేము తప్పులు చేయడానికి రాలేదు..ఆపడానికి వచ్చాం: ఏఏపీ


తాము తప్పులు చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదని.. వ్యవస్థలో అధికారం పేరిట జరుగుతున్న దురాచారాలను అడ్డుకునేందుకు మాత్రమే వచ్చామని... తప్పు ఎక్కడ జరిగినా తాము దానిని సమర్థించమని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు డబ్బులు పంచుతూ, ప్రలోభాలకు పాల్పడుతున్నారని నిన్న సాయంత్రం నుంచి కొన్ని చానళ్లలో వీడియోను టెలికాస్ట్ చేస్తున్నారని... వాటి ఒరిజినల్ ఫూటేజీని తమకు అందజేయాలని ఏఏపీ ప్రతినిధి కోరారు. అనురంజన్ జా అనే వ్యక్తి తాను స్టింగ్ ఆపరేషన్ చేశానని చెబుతూ మీడియాకు ఒక వీడియో విడుదల చేశాడని... అతనిని తాము ఒరిజినల్ వీడియో అడిగామని, వీడియో ఇస్తానన్న ఆయన తరువాత ముఖం చాటేశాడని తెలిపారు.

సాంకేతిక నైపుణ్యంతో తప్పుడు ప్రచారానికి పాల్పడడం సరికాదని మీడియా సంస్థలకు ఆయన హితవు పలికారు. నిజాలు తెలుసుకుని వార్తలు ప్రచారం చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. ఎడిట్ చేసిన వీడియోలను తీసుకుని తమ పార్టీని ఇబ్బందుల పాలు చేయాలని చూస్తున్నారని... తాము ఉన్నత లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చామన్న విషయాన్ని వారు గుర్తించాలని కోరారు. అనురంజన్ జా కు సాయంత్రం వరకు సమయం ఇస్తున్నామని, ఆయన తీసిన ఒరిజినల్ వీడియోలు తమకు అందజేస్తే... అందులోని నిజాలు తెలుసుకుని తప్పుచేసిన వారిని శిక్షిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News