: మాదకద్రవ్యాల డీలర్లతో నాకెలాంటి సంబంధం లేదు: బాక్సర్ విజేందర్
బీజింగ్ ఒలింపిక్స్ బాక్సింగ్ కాంస్య పతక విజేత విజేందర్ సింగ్.. మాదకద్రవ్యాల డీలర్లతో తనకెలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు. పంజాబ్ పోలీసులు గురవారం జిరాక్ పూర్ లో అనూప్ సింగ్ ఖలోన్ అనే ఎన్నారై నుంచి 26 కిలలో హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ మార్కెట్లో రూ. 130 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
అయితే ఆ వ్యక్తి తన కస్టమర్లలో భారత బాక్సర్ విజేందర్ సింగ్ కూడా ఉన్నట్టు వెల్లడించడం సంచలనం రేపింది. తన ఫ్లాట్ బయట నిలిపి ఉన్న కార్లలో ఒకటి విజేందర్ కారు అని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. అయితే, పోలీసు దర్యాప్తులో ఆ కారు విజేందర్ భార్య అర్చన సింగ్ కారు అని తేలింది. ఈ నేపథ్యంలో విజేందర్ స్పందిస్తూ, అరెస్టయిన వ్యక్తితో తనకెలాంటి లావాదేవీలు లేవని కొట్టిపారేశాడు.
విజేందర్ ఓ వార్తా చానల్ తో మాట్లాడుతూ, 'నేను ఎంతో మందిని కలుస్తుంటాను. ఇతనూ ఓ మిత్రుడి ద్వారా పరిచమయ్యాడు. అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా అతనితో సంబంధంలేదు. బహుశా నా మిత్రుడు నా కారును అనూప్ ఇంటిముందు పార్క్ చేసి ఉంటాడు. కేసులోంచి తప్పించుకునేందుకు అనూప్ నా పేరును వాడుకుంటున్నట్టుంది' అని వివరించాడు.