: బాబా రాందేవ్ కు బీజేపీ బాసట
ఒకటా రెండా.. యోగా గురు బాబా రాందేవ్ కు చెందిన పతంజలి యోగ పీఠం ట్రస్ట్ పై ఉత్తారాఖండ్ సర్కారు 81 కేసులను మోపింది. అంతేకాదు, రానున్న రోజుల్లో మరిన్ని నమోదు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ రెండు రోజుల క్రితమే ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. కేంద్ర ప్రభుత్వం అవినీతి, విదేశాల్లోని నల్లధనంపై బాబా గళమెత్తినందుకే ఆయనపై ఉత్తరాఖండ్ లోని కాంగ్రెస్ సర్కారు వేధింపులకు పాల్పడుతోందని ఆ రాష్ట్ర విపక్ష నేత అజయ్ భట్ అన్నారు. బాబా రాందేవ్ పై వేధింపుల వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందన్నారు. రాష్ట్ర, కేంద్ర సర్కారులు ప్రతీకార రాజకీయాలను అనుసరిస్తున్నాయని ఆరోపించారు. సన్యాసులు, జాతీయవాదులను సరైన కారణాలు లేకుండా వేధిస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. బాబాపై కేసులు నమోదు చేసిన ప్రాంతానికి విజయ్ బహుగుణ స్వయంగా వెళ్లడం కుట్రలో భాగమేనన్నారు.