: మచిలీపట్నానికి దగ్గర్లో హెలెన్.. తీవ్ర గాలులతో బీభత్సం
మచిలీపట్నానికి 60 కిలోమీటర్ల దూరంలో హెలెన్ తుపాను కేంద్రీకృతమై ఉంది. ఈ సాయంత్రానికి తీరం దాటనున్న హెలెన్ మచిలీపట్నం తీరప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హెలెన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. తుపాను కారణంగా వీస్తున్న గాలులు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల ధాటికి పూరిగుడిసెలు ఎగిరిపడుతున్నాయి. చెట్లు విరిగిపడుతున్నాయి. పంటలు నాశనమైపోయాయి. పెనుగాలులకు కొబ్బరి చెట్టు విరిగి ఇంటి మీద పడటంతో ఓ మహిళ మృతి చెందింది. కొత్తపేట తీరంలో తుపానులో చిక్కుకుపోయిన 20 మంది మత్స్యకారులను రక్షించాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ను ఫోన్ లో ఆదేశించారు.