: వార్షికోత్సవ వేడుకలకు రూ.21 లక్షలు ఖర్చుచేసిన యూపీఏ
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు.. యూపీఏ ప్రభుత్వం అనుకుంటే ఖర్చుకు ఏమాత్రం వెనకాడదు. వివరాల్లోకి వెళ్తే, ఈ ఏడాది మే 21న యూపీఏ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని రేస్ కోర్స్ రోడ్ లోని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో భారీ పార్టీ ఏర్పాటు చేసింది. పార్టీకి లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఇతర రాజకీయ నేతలు, మీడియా ప్రముఖులు కలిపి మూడువందల మంది అతిథులు హాజరయ్యారు. ఒక్కొక్కరికి రూ.6,871 చొప్పున మొత్తం రూ.21 లక్షలు ఖర్చు చేసినట్లు ఆంగ్ల పత్రిక 'ఎకనామిక్స్ టైమ్స్' పేర్కొంది. ఆర్టీఐ చట్టం కింద ఈ వివరాలను పత్రిక తెలుసుకుంది. పలు రకాల ఖరీదైన వంటకాలతో పార్టీకి వచ్చిన అతిథులను సంతోషపెట్టారట. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేశంలో నెలకొన్న మాంద్యం, ఆర్ధిక సంక్షోభంపై తీవ్రంగా చర్చలు జరుపుతున్న ఈ సమయంలో ఇలాంటి పార్టీ జరగడం విశేషమని పత్రిక వివరించింది.