: జేసీ సోదరులు క్రిమినల్స్ అంటూ వెలసిన ఫ్లెక్సీలు


అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కందిగోపుల మురళీప్రసాద్ జేసీ సోదరులు క్రిమినల్స్ అంటూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి పలు ఆరోపణలు చేశారు. కరపత్రాల్లో జేసీ సోదరుల స్వస్థలం తెలంగాణలోని గద్వాల అని, తాడిపత్రికి వలస వచ్చి రాజకీయ పెత్తనం చెలాయిస్తూ స్థిరపడ్డారని ఆరోపించారు.

1989లో హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దివంగత నేత ఎన్టీఆర్ పై ప్రత్యర్థి అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారని, మద్దెలచెరువు సూరితో కలిసి పరిటాల రవీంద్ర ను హత్య చేశారని ఆరోపించారు. ప్రభుత్వ అండతో ఈ కేసుల నుంచి జేసీ తన పేరును తొలగింపజేసుకున్నారని ఆరోపించారు. సూరి జైలు నుంచి విడుదలైతే తాడిపత్రిలో భారీ విందు ఏర్పాటు చేశారని అన్నారు. పరిటాల రవి మృతి అనంతరం సునీత బరిలోకి దిగితే... రౌడీలను పంపి భయబ్రాంతులను చేశారని పేర్కొన్నారు.

తాడిపత్రి ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గాన్ని అణచివేశారని కరపత్రాల్లో తెలిపారు. కమ్మవారి ప్రాబల్యం అధికంగా ఉండే గ్రామాల అభివృద్ధిని అడ్డుకున్నారని, మసీదులను ధ్వంసం చేసి ముస్లింలపై దౌర్జన్యాలకు దిగారని అన్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలంటే జేసీ సోదరులకు చులకన అని... అందుకే వారి ముందు బడుగు, బలహీనవర్గాల ప్రజలు, నేతలు, కార్యకర్తలు చేతులు కట్టుకుని నిల్చుంటారని విమర్శించారు. విలేకరులు వారికి వ్యతిరేకంగా కథనాలు రాస్తే వారిని బలిపశువులను చేస్తారని, తాడిపత్రి ప్రాంతంలో ఫ్యాక్షన్ ను పెంచి పోషిస్తున్నది జేసీ సోదరులేనన్న విషయం రాష్ట్రం మొత్తానికి తెలుసని పేర్కొన్నారు. పదవి కోసం ఎంతకైనా తెగించే జేసీ సోదరులు దొడ్డిదారిలో పదవులు సంపాదించుకుని ప్రజలను మభ్యపెట్టేందుకు మరోసారి వస్తున్నారు జాగ్రత్త అని కరపత్రాలు, ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News