: కాఫీ తాగండి బాబూ...
కాఫీ తాగితే మీ ఆరోగ్యానికి మంచిదని శాస్త్రవేత్తలు బోలెడు అధ్యయనాలు చేసి చెబుతున్నా కొందరు కాఫీ తాగరు. కాఫీ తాగడం అనేది ఏదో దురలవాటు అయినట్టు, తాము కాఫీ తాగకుంటే ఏదో బుద్ధిమంతులు అయినట్టుగా ఫీలయిపోతుంటారు. కానీ కాఫీ తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో లాభమని మరోసారి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన శరీరంలోని సూక్ష్మ రక్తనాళాలు చక్కగా పనిచేయడానికి కాఫీ బాగా తోడ్పడుతుందని పరిశోధకులు తాజా పరిశోధనలో గుర్తించారు.
సాధారణంగా శరీరంలోని సూక్ష్మ రక్తనాళాల పనితీరును వేళ్లల్లో రక్త ప్రసరణను బట్టి గుర్తిస్తుంటారు. కప్పు కాఫీ తాగిన వారి వేళ్లల్లో రక్త ప్రసరణ గణనీయంగా మెరుగుపడినట్టు జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. కెఫీన్‌లేని కాఫీ తాగిన వారితో పోల్చుకుంటే కెఫీన్‌తో కూడిన కాఫీ తాగిన వారిలో 75 నిమిషాల కాలంలో 30 శాతం రక్త ప్రసరణ పెరిగినట్టు పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. కెఫీన్‌తో కూడిన కాఫీ తాగిన వారిలో రక్తపోటు పెరగడం, రక్తనాళాల లోపలి గోడల పనితీరు మెరుగుపడడం వంటి లక్షణాలు కనిపించాయని ర్యుక్యుస్ విశ్వవిద్యాలయానికి చెందిన మసాటో సుసుయ్ చెబుతున్నారు. అయితే కాఫీ వల్ల గుండె కొట్టుకునే వేగంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని, దీనికి కాఫీలోని కెఫీన్ రక్తనాళాలు తెరుచుకునేలా చేయడం, వాపును తగ్గించడం వంటివే కారణం కావచ్చని పరిశోధకులు చెబుతున్నారు.