: మీ చిన్నారులను బాగా నిద్రపోనివ్వండి
చిన్న పిల్లలు నిద్రకు ఉపక్రమించే సమయంలో టీవీ పెట్టడం, లేదా గట్టిగా మాట్లాడడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు సరిగా నిద్రపోలేరు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందట. చక్కగా నిద్రపోయే పిల్లలు మానసికంగా చక్కటి ఆరోగ్యంతో ఉండడమే కాదు, వారి మెదడు వృద్ధిలో కూడా నిద్ర ఉపకరిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈఈజీ యంత్రం ద్వారా కొందరు చిన్నారుల మెదళ్లలోని క్రియాశీలతను పరిశీలించారు. చిన్న పిల్లలు చక్కగా రాత్రిళ్లు నిద్రపోవడం వారి మానసిక ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తుందని, మెదడు వృద్ధిలో తోడ్పడుతుందని ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు. చిన్నారులు నిద్రపోయే సమయంలో వారి మెదడులోని కుడి, ఎడమ అర్థగోళాల మధ్య సంబంధాలు 20 శాతం దాకా బలోపేతం అవుతాయని, ఇది వారి మెదడు పనితీరు పరిణతి చెందడంలో తోడ్పడుతున్నట్టు వీరి అధ్యయనంలో తేలింది.
రాత్రివేళ నిద్రలో మెదడులోని రెండు అర్థగోళాల లోపలి భాగంలో సంబంధాలు బలహీనపడినా, రెండు అర్ధగోళాల మధ్య మాత్రం బలోపేతం అవుతున్నట్టు గమనించామని పరిశోధకులు సేలోమ్ కుర్త్ తెలిపారు. చిన్న పిల్లలు వయసు పెరుగుతున్నకొద్దీ నిద్రలో వారి మెదడులోని అనుసంధానాలు బలోపేతం అవుతున్నట్టు ఈ పరిశోధనలో గుర్తించారు. నిద్రకు, మెదడు పరిణతి చెందడానికీ సన్నిహిత సంబంధం ఉందనే దానికి బలమైన సంకేతాలున్నాయనీ, కాబట్టి చిన్నారుల్లో నిద్ర సరిగ్గా లేకపోతే దాని ప్రభావం వారి మెదడు పరిణతిపై ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.