: ఉద్యోగం లేకుంటే వయసుకు కూడా లోకువేనట


సంపాదన లేని పురుషుడిని చూస్తే ఎవరికైనా లోకువే. ఉద్యోగం పురుష లక్షణం అని అందుకే పెద్దలన్నారేమో. అయితే ఉద్యోగం లేకుండా, ఎలాంటి సంపాదన లేకుండా ఉండే పురుష పుంగవులంటే వయసుకు కూడా లోకువే. అందుకే వారిలో త్వరలోనే వార్ధక్యపు లక్షణాలు కనిపిస్తాయట. ఈ విషయం తాజా అధ్యయనంలో తేలింది.

పరిశోధకులు రెండేళ్లకు మించి ఎలాంటి ఉద్యోగం లేకుండా నిరుద్యోగిగా ఉండే పురుషుల్లో వార్ధక్య లక్షణాలు మిగిలిన వారితో పోల్చుకుంటే చాలా వేగంగా కనిపిస్తాయని తాజా అధ్యయనంలో కనుగొన్నారు. అంటే నిరుద్యోగం వల్ల వారి డిఎన్‌ఏలో ఈ దిశగా మార్పులు కనిపిస్తాయని ఈ అధ్యయనంలో తేలింది. ఇందుకోసం పరిశోధకులు 1966లో జన్మించిన ఐదువేలమందికి పైగా స్త్రీ, పురుషుల డిఎన్‌ఏల నమూనాలను సేకరించి వాటిని విశ్లేషించారు. ముఖ్యంగా జన్యుసంకేతాలు క్షీణించి పోకుండా పరిరక్షించే టెలోమీర్‌ వ్యవస్థను, వాటిలోని తేడాలను పరిశోధకులు సునిశితంగా గమనించారు.

క్రోమోజోముల చివర్ల ఉండే ఈ టెలోమేర్లు కుచించుకుపోయిన విధానం వార్ధక్య లక్షణాలను ప్రతిబింబిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకు జీవ, సామాజిక, ప్రవర్తనా పరమైన అంశాలు కూడా కారణం కావచ్చునని, ఆరోగ్య సమస్యల నేపధ్యంలో ఉద్యోగం చేయకుండా కూర్చున్న వారిలో టెలోమేర్లు కుచించుకుపోవడం చాలా స్పష్టంగా కనిపించిందని పరిశోధకులు తెలిపారు. అయితే అనారోగ్య పరిస్థితుల్లో ఇంటి పట్టునే కూర్చున్న నిరుద్యోగులుగా ఉన్న మహిళల్లో ఇలాంటి తరహా పరిణామాలు కనిపించడం లేదని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News