: భారతీయ రేపిస్టుకు ఆస్ట్రేలియాలో 18 ఏళ్ల జైలు శిక్ష
సెరిబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతున్న అసహాయ మహిళలపై అత్యాచారానికి పాల్పడిన భారతీయ సంతతికి చెందిన వినోద్ జానీ కుమార్(31) అనే వ్యక్తికి ఆస్ట్రేలియా కోర్టు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ వ్యాధికి గురై చక్రాలకుర్చీకే పరిమితమైపోయిన నిస్సహాయ మహిళపై ఈ దారుణానికి పాల్పడడం హేయమని విక్టోరియా కౌంటీ కోర్టు న్యాయమూర్తి ఫెలిసిటీ హాంపెల్ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రాంతంలో యూరాలా అనే స్వచ్ఛంద సంస్థ వికలాంగులకు సేవలందిస్తుంది.
ఇందులో వ్యాధిగ్రస్థుల సంరక్షణ బాధ్యతలు చూసేందుకు విధుల్లోకి చేరిన కుమార్ ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పుడు వారు తమను తాము రక్షించుకునే స్థితిలో కూడా లేరు. ఈ దారుణం అప్పటికప్పుడు అనుకునో లేక అవకాశవాదంతో చేసిందో కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అతడు పదేపదే లైంగిక నేరాలకు పాల్పడ్డాడని న్యాయమూర్తి అన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ కుమార్ ఒక్కడే ఉన్నాడని న్యాయమూర్తి తెలిపారు.