: శీలానికి వెల కట్టిన పెద్దలు..కేసు నమోదు చేయని పోలీసులు
సభ్య సమాజం తల దించుకునే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట సమీపంలోని భుజంగంపేటలో వ్యవసాయ కుటుంబానికి చెందిన ఓ మానసిక వికలాంగ మూగ యువతిపై అదే గ్రామానికి చెందిన శ్రీను అనే కామాంధుడి కన్ను పడింది. ఆమె అసహాయతను ఆసరాగా చేసుకుని, గత పది నెలలుగా ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు.
చివరకు ఆమె గర్భం ధరించింది. ఆరా తీసిన తల్లిదండ్రులకు శ్రీనే కారణమని ఆ యువతి తెలిపింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. వైద్యం చేయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడి వైద్యులు ఆమెకు రక్తం లేదని, జాగ్రత్తగా చూసుకోకుంటే తల్లీ బిడ్డా ఇద్దరికీ ముప్పేనని చెప్పారు. దీంతో వారు గ్రామ పెద్దలను ఆశ్రయించారు.
విషయం తెలిసిన పెద్దలు బాధితుడి తరపున వకాల్తా పుచ్చుకుని ఆమె శీలానికి 80 వేల రూపాయల వెల కట్టారు. పెద్దల ముందు డబ్బు చెల్లిస్తానని ఒప్పుకున్న శ్రీను... కొత్త నాటకానికి తెరతీసి, తన వద్ద డబ్బు లేదని కేసు పెట్టుకొమ్మని ఎదురు తిరిగాడు. పంచాయతీలో గ్రామపెద్దలు చేసిన న్యాయాన్ని, కేసు నమోదు చేసుకోకుండా పోలీసులు చేసిన అన్యాయాన్ని స్థానికులు అసహ్యించుకుంటున్నారు.