: ఈ ట్వీట్‌ భలే భలే!


ఇప్పుడు ఏ విషయానికైనా ట్వీటివ్వడం మామూలైపోయింది. ఇలాంటి ట్వీట్‌లను మరికాస్త మెరుగుపరచి మన ఆత్మీయుల సంరక్షణ విషయంలో ఉపయోగించుకోవడానికి పుట్టుకొచ్చిన పరికరమే ట్వీట్‌పీ. నేటి కాలంలో యువత ఎక్కువగా ఉద్యోగాల పేరుతో ఇళ్లపట్టున ఉండడం తక్కువ. పెళ్లై పిల్లలు పుట్టినా కూడా ఉద్యోగ విధులను నిర్వర్తించడానికి పిల్లల్ని ఆయాలకు, శిశు సంరక్షణ కేంద్రాల్లోను వదిలి వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి సమయాల్లో పిల్లల్ని సంరక్షకులు సరిగా పట్టించుకున్నారో లేదోననే దిగులు తల్లులను వేధిస్తుంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు మూత్ర విసర్జన చేస్తే వాళ్ల డైపర్లను వెంటనే మార్చాలి. లేకపోతే పలు ఇన్‌ఫెక్షన్ల బారినపడే అవకాశం ఉంది. ఇందుకోసం ఈ కొత్తరకం పరికరాన్ని తయారుచేశారు.

మీ పిల్లలు మూత్ర విసర్జన చేస్తే, వారికి కొత్త డైపర్‌ మార్చారా? లేదా? అనే విషయాన్ని గురించి ఆలోచించాల్సిన పనిలేకుండా ఈ పరికరం మీకు సమాచారాన్ని తెలియజేస్తుందట. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా మెత్తగా చిన్నగా ఉండే ఈ కొత్త పరికరాన్ని మీ పిల్లల డైపర్‌కి అతికిస్తే చాలు, వారు తిరుగుతూ మూత్ర విసర్జన చేసినప్పుడు, లేదా నీటిలో తడిసినప్పుడు డైపర్‌కు తేమ చేరి వారిని ఇబ్బందికి గురిచేసినప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌కు మీ పిల్లల డైపర్‌ మార్చాలి అన్న సందేశాన్ని ఈ పరికరం అందజేస్తుందట.

మీరు ఆఫీసులో ఎక్కడున్నా ఈ ట్వీట్‌ను చూసుకుని మీ పిల్లల సంరక్షకులతో మాట్లాడి డైపర్‌ను మార్చమని సూచనలను చేయవచ్చట. ఈ పరికరం అంతటితో తన పని ఆపేయదు. ఇప్పటికి ఎన్ని డైపర్లను వాడారో కూడా లెక్కచెప్పి కొత్త ప్యాకెట్లను కొనాల్సిన అవసరాన్ని గురించి కూడా తల్లులకు గుర్తుచేస్తుందట. మొత్తానికి ఈ ట్వీట్‌ తల్లులకు చాలా ఉపకరిస్తుంది.

  • Loading...

More Telugu News