: రాత్రిపూటైతే ముప్పు తక్కువేనట
ఆస్ప్రిన్ మాత్రలను పగలుకన్నా రాత్రిపూట వేసుకుంటే మరింత మెరుగైన ఫలితాలుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా గుండెజబ్బు ఉన్నవారికి తక్కువ మోతాదులో ఆస్ప్రిన్ మాత్రలను వాడాల్సిందిగా వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఈ మాత్రలను ఉదయం పూటకన్నా రాత్రి నిద్రపోయే ముందు వేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఉదయం పూటకన్నా రాత్రిపూట ఆస్ప్రిన్ మాత్రలను వేసుకోవడం వల్ల గుండెపోటు ముప్పు తగ్గుతున్నట్టు పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఈ మాత్రలను వేసుకోవడం వల్ల ఇది రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. రక్తాన్ని పలుచబడేలా చేస్తుంది. ఇలాంటి గుణాలున్న ఆస్ప్రిన్ మాత్రను ఎప్పుడు వేసుకుంటే మరింత మేలు అనే విషయంపై లీడెన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో రాత్రిపూట వేసుకుంటే మేలనే విషయం వెల్లడైంది. రాత్రిపూట ఈ మాత్రను వేసుకునేవారి రక్తంలోని ప్లేట్‌లెట్ల పనితీరు మందగించినట్టు గుర్తించామని లీడెన్ విశ్వవిద్యాలయానికి చెందిన టోబియాస్ బోంటెన్ చెబుతున్నారు.