: బిగ్గరగా నవ్వినందుకు 30 రోజుల జైలుశిక్ష!
బిగ్గరగా నవ్వితే జైలులో పడేస్తారా? ఇదెక్కడి విడ్డూరం అని ఆశ్చర్యపోకండి. బిగ్గరగా నవ్వినందుకు 30 రోజుల జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధమవ్వాల్సి వచ్చింది అమెరికాలో ఓ పౌరుడికి. రాబర్ట్ షివెల్లి అనే నలభై రెండేళ్ల ఓ వ్యక్తి న్యూయార్క్ లోని రాక్ విల్లే సెంటర్లో నివాసముంటున్నాడు. నరాల సంబంధిత జబ్బుతో బాధపడుతున్న షివెల్లి తన తల్లితో కలిసి ఉంటున్నాడు.
గత నెల 12, 13 తేదీలలో కావాలనే బిగ్గరగా నవ్వాడనీ, అది తమ ప్రశాంతతకు భంగం కలిగించిందనీ ఆరోపిస్తూ షివెల్లి పొరుగువ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని నవ్వు వీధి మొత్తం ప్రతిధ్వనించిందని సదరు వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, దీనికి షివెల్లి సమాధానం మాత్రం తమాషాగా వుంది.
'నీ నవ్వు సౌండు మాకు వినిపించడం లేద'ని పొరుగువాడు పదే పదే వెక్కిరించడంతో, తాను గట్టిగా నవ్వాల్సివచ్చిందని షివెల్లి చెప్పుకొచ్చాడు. ఈ కేసును విచారించిన పోలీసులు షివెల్లి హద్దులు మీరాడనీ, పోరుగిళ్ళ వారి ప్రశాంతతను భగ్నం చేశాడని నిర్ధారించుకొని, 500 డాలర్ల జరిమానా లేదా, 30 రోజుల జైలు శిక్ష ... రెండింటిలో ఏది కావాలో తేల్చుకోమన్నారు. దీంతో, నవ్వడం కూడా నేరమేనా? అంటూ షివెల్లి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు.