: ఫోనులోనే చూడక్కర్లేదు...
మనకు ఏవైనా మెసేజీలు, లేదా మెయిళ్లు వస్తే మనం వెంటనే మన స్మార్ట్ ఫోన్లో చూసుకుని బదులివ్వడం చేస్తాం. అదే కారు డ్రైవింగ్ చేసే సమయంలో అయితే ఇలాంటివి చూసుకోవడం కుదరదు. ఒకవేళ అర్జంటుగా చూసుకోవాలనుకుంటే వెంటనే కారును ఎక్కడైనా ఒకపక్కగా ఆపి చూడాల్సి ఉంటుంది. అలాకాకుండా మీ కారు అద్దమే మీ సెల్‌ఫోన్ స్క్రీన్‌లాగా మారిపోయే సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
నెక్ట్స్ సంస్థ ఒక సరికొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఈ సంస్థకు చెందిన అమెరికాలోని భారతీయ ఇంజనీర్లు మన స్మార్ట్‌ఫోన్ తెరపై కనిపించేవన్నీ కూడా మన కారు ముందరి అద్దంపై చూసుకునే విధంగా సాంకేతికతను అభివృద్ధి చేశారు. 'హెడ్స్ అప్' అని పిలుస్తున్న ఈ సాంకేతికతలో స్మార్ట్ ఫోన్ తెరను తాకాల్సిన అవసరం లేకుండా కేవలం మన వాయిస్ కమాండ్స్‌కు అనుగుణంగా ఇది స్పందిస్తుంది. అంతేకాదు అద్దంలోనుండి మనం ప్రయాణిస్తున్న మార్గాన్ని చూడడానికి కూడా దీనివల్ల ఎలాంటి ఆటంకం ఉండదు. మన స్మార్ట్‌ఫోన్‌లో 'హెడ్స్ అప్' యాప్ ని వేసుకుని బ్లూటూత్తోగానీ లేదా యూఎస్బీతోగానీ ఈ ప్రత్యేకమైన అద్దానికి అనుసంధానించాలి. అప్పుడు మన ఫోన్‌కు ఎస్ఎంఎస్లు, కాల్స్ వచ్చినప్పుడు కారు అద్దంపై దానికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. అప్పుడు మనం వాటిని చూడాలన్నా, లేదా మాట్లాడాలనుకున్నా, వద్దనుకున్నా వాయిస్ కమాండ్స్‌ను ఉపయోగించవచ్చని నెక్ట్స్ సంస్థ సీఈఓ అర్ణబ్ రాయ్ చౌధురి, ఆయన బృందంలోని స్మితా మజుందార్, ఎడ్డీ చౌధురి చెబుతున్నారు.