: రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరాం: లగడపాటి
విభజనపై కేంద్రం తీరును రాష్ట్రపతికి వివరించడానికి కేంద్రమంత్రులు, ఎంపీలం కలిసి అపాయింట్ మెంట్ అడిగామని ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి సిఫారసు చేస్తేనే తెలంగాణ బిల్లు ముందుకు వెళ్తుందని అన్నారు. విభజన అడ్డుకునేందుకు చివరి వరకూ తాము పోరాడుతామన్న ఆయన, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఆయనను కలవనున్నారని అన్నారు. అప్రజాస్వామ్యంగా, ఏకపక్షంగా, బలవంతంగా విభజన జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం వినిపించడంలో సఫలమయ్యారని తెలిపారు. కేవలం సీఎం పదవికోసమే విభజన అంటున్నారని వేర్పాటు వాదులను విమర్శించారు. వేర్పాటు వాదంతో ముందుకు వెళ్లవద్దని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. సమైక్యంగా ఉంచేందుకు జాతీయ పార్టీల అధ్యక్షులను కలుస్తామని ఆయన అన్నారు. విభజనపై సుప్రీంకోర్టు తీర్పుపై సమైక్య వాదులు నిరాశ చెందవద్దని ఆయన సూచించారు. సరైన సమయంలో సుప్రీంకోర్టు తలుపులు తడతామని ఆయన స్పష్టం చేశారు.