: శీలానికి రూ. 2 లక్షలు ఖరీదు కట్టిన భర్త
ప్రేమించి, పెళ్లి చేసుకుని చివరకు భార్యను వదిలించుకోవడానికి రూ. 2 లక్షలకు ఖరీదు కట్టాడో భర్త. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం బొల్లినగర్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, బొల్లినగర్ కు చెందిన ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన వెంకటేశ్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరికీ తల్లిదండ్రులు లేరు. వెంకటేశ్ కు ఖమ్మంలో ఉండే అతని మామ ఆర్థిక సాయం అందిస్తుంటాడు. ఆ యువతి డీఎంఎల్ టీ కోర్సు ఇటీవలే పూర్తి చేసింది.
కొంతకాలం వీరి ప్రేమ సజావుగా సాగింది. అనంతరం వీరి పెళ్లికి వెంకటేశ్ మామ అభ్యంతరం చెప్పడంతో, నాలుగు నెలల క్రితం ఎవరికీ తెలియకుండా యువతి ఇంట్లోనే పెళ్లి చేసుకున్నారు. నాలుగు నెలల తర్వాత ఆ యువతి గర్భం దాల్చింది. దాంతో వెంకటేశ్ ఆమెకు అబార్షన్ చేయించి... అనంతరం ఆమెను వదిలించుకునేందుకు ప్లాన్ వేశాడు. పెద్దలతో పంచాయతీ పెట్టించి రూ. 2 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. అయితే, పంచాయతీ జరిగిన రెండు రోజుల తర్వాత ఆ యువతి తనకు భర్తే కావాలంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.