: బరువు తగ్గితే వయసు తగ్గుతుంది!


స్థూలకాయం ఇప్పడు ఎక్కువమంది యువతను వేధిస్తున్న సమస్య. కారణాలేవైనా అధిక బరువు కారణంగా వయసు కూడా ఎక్కువగా కనిపిస్తుంటారు. అంతేకాదు అనారోగ్యంతో కూడా సతమతమవుతుంటారు. అలాకాకుండా ఆహారంలో మార్పులు చేసుకోవడం, తగు వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇలా బరువు తగ్గడం వల్ల మీరు తక్కువ వయసున్న వారిగా కూడా కనిపిస్తారట. ఈ మేరకు పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

అధిక బరువుండేవారు వ్యాయామం చేయడం ద్వారా లేదా ఆపరేషన్‌ ద్వారాకానీ బరువు తగ్గినట్టయితే వారిపై వృద్ధాప్య ప్రభావం కూడా తగ్గుతుందని, జీవిత కాలం కూడా పెరుగుతుందని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ సర్జరీ చేయించుకున్న రోగుల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక అధ్యయనం చేశారు. వీరు తమ అధ్యయనంలో శస్త్రచికిత్సకు ముందు, చేయించుకున్న తర్వాత రోగుల జన్యు సమాచారాన్ని విశ్లేషించారు. ఈ రోగుల్లో మూడొంతుల మంది సగటున 49 ఏళ్ల వయసుండే మహిళలేనట. వారి ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) దాదాపు 44.3. శస్త్రచికిత్స ద్వారా తమ అధిక బరువులో 71 శాతం కోల్పోయిన తర్వాత ఏడాది తిరగకముందే ఆకట్టుకునే ఆకృతితో ఇట్టే ఒదిగిపోతున్నారట.

దీనికి కారణం, శరీర నిర్మాణంలో కీలకమైన టెలోమెర్స్‌ అనే బయోమార్కర్లు. వీటి పొడవు ఎక్కువగా ఉంటే వృద్ధాప్య ఛాయలు దూరమైపోతాయట. ఈ సర్జరీ చేయించుకున్నవారిలో టెలోమెర్స్‌ పొడుగవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు ఇలాంటి వారిలో వృద్ధాప్యం వల్ల వచ్చే టైప్‌-2 మధుమేహం, గుండె, శ్వాసకు సంబంధించిన పలు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా తక్కువగానే ఉంటుందని తేలింది. కాబట్టి బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

  • Loading...

More Telugu News