: అమ్మకానికి అఖిలేశ్ యాదవ్ పంపిణీ చేసిన ల్యాప్ టాప్ లు
ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్ ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే ఎన్నికల మేనిపెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ల్యాప్ టాప్ ల పంపిణీ పధకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్ధులందరికి ప్రభుత్వం ఉచితంగా ల్యాప్ టాప్ లు పంపిణీ చేసింది. కాగా లబ్ధిదారులు వాటిని రూ. 4 వేల నుంచి రూ.6 వేల వరకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఆన్ లైన్ విక్రయాలు నిర్వహించే వెబ్ సైట్లలో ప్రకటనలు పెట్టి అమ్ముతున్నట్టు సమాచారం. అలీఘడ్, లక్నో, వారణాసి, ఆగ్రా ప్రాంతాల నుంచి విక్రయాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. తమ దగ్గర ఇప్పటికే కంప్యూటర్ ఉందని కొంతమంది చెబితే, మరికొందరు అవి తమకు ఉపయోగపడటం లేదని పేర్కొంటూ బహిరంగంగా అమ్ముతున్నట్టు సమాచారం.