: ఢిల్లీని వలసల నగరంగా అభివర్ణించిన రాహుల్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ రాజధాని ఢిల్లీని వలసల నగరంగా అభివర్ణించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 4న జరగనున్న నేపథ్యంలో అంబేద్కర్ నగర్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. వలసల కారణంగా నగరంలో జనాభా పెరిగినట్టు ఆయన తెలిపారు. దీంతో ఇదొక 'మినీ భారతదేశం'గా మారిందని అన్నారు. తమ కుటుంబం కూడా కాశ్మీర్ నుంచి ఉత్తరప్రదేశ్ కి, ఆ తరువాత ఢిల్లీకి వలస వచ్చిందన్నారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో నగరానికి వలసలు వస్తుంటారని, ప్రతి ఒక్కరూ అలా వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని అన్నారు. గతంలో వలసల కారణంగానే ఢిల్లీ నగరంలో అత్యాచారాలు జరుగుతున్నాయని షీలా దీక్షిత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిని ఖండించిన రాహుల్, ఢిల్లీ రాష్ట్రాన్ని షీలా అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. ఆమెను మరోసారి ఎన్నికల్లో గెలిపించాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు.