: లంకకు వ్యతిరేకంగా ఓటేయండి: కేంద్రానికి డీఎంకే సూచన
యూపీఏ సర్కారులో కాంగ్రెస్ ప్రధాన మిత్ర పక్షమైన డీఎంకే.. శ్రీలంక వ్యవహారంలో కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం సమావేశంలో లంకకు వ్యతిరేకంగా ఓటేయాలని డీఎంకే కోరింది. ఐరాస సదస్సు జెనీవాలో వచ్చేవారం నిర్వహించనున్నారు.
అయితే, అమెరికా పెట్టబోయే తీర్మానం మేరకే తమ నిర్ణయం ఉంటుందని ప్రధాని మన్మోహన్ ఇంతకుముందే చెప్పారు. ఈ నేపథ్యంలో డీఎంకే తన ఒత్తిడి మరింత పెంచింది. తమిళులపై దురాగతాలకు పాల్పడుతున్న లంక సర్కారు హిట్లర్ జమానాను తలపింపజేస్తోందని పేర్కొంది.
ఈరోజు లోక్ సభలో డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు మాట్లాడుతూ, 'కేంద్రం తాను ఏం భావిస్తుందో కచ్చితంగా అదే తీర్మానించాలి. తీవ్రమైన యుద్ధనేరాలకు పాల్పడ్డ శ్రీలంక దోషిత్వాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు నిరూపించేవిధంగా ఆ తీర్మానం ఉండాలి' అని ఉద్వేగభరితంగా చెప్పారు.
ఇక ఐరాసలో లంక విషయంలో ఆమోదయోగ్య నిర్ణయం తీసుకుంటామని లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. అయితే మంత్రి జవాబు నచ్చని డీఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే వాకౌట్ చేశాయి.