: సికింద్రాబాద్ స్టేషన్లో 'బాంబు' వుందని బెదిరించిన వ్యక్తి అరెస్టు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని 9వ నెంబరు ప్లాట్ ఫాంలో బాంబు ఉందంటూ తప్పుడు సమాచారమిచ్చిన వ్యక్తిని జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా మునగపాడుకు చెందిన కాసయ్య హైదరాబాద్ లో పని చేసి, కొద్ది రోజుల క్రితం స్వస్థలానికి వెళ్లాడు. ఈ నెల 12న ఉదయం 9.50 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోని ఫ్లాట్ ఫాం నెంబర్ 9లో బాంబు ఉందని బెదిరించాడు. దీంతో హుటాహుటిన ఫ్లాట్ ఫాం ఖాళీ చేయించి... బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించారు. తప్పుడు ఫోన్ కాల్ వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇబ్బంది పడ్డారు. ఫోన్ నెంబర్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడ్డ కాసయ్యను అరెస్టు చేశారు.