: ముందు మనభాష నేర్చుకుంటే...
మన పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడలేకపోతున్నారని చాలామంది బాధపడుతుంటారు. దీనికి పిల్లలను చిన్న చిన్న కాన్వెంటుల్లో చేర్పించడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. చిన్న కాన్వెంటు యాజమాన్యాలు ఎక్కువ వేతనాలను ఇవ్వలేక ఇంగ్లీషు సరిగా రానివారిని ఉపాధ్యాయులుగా నియమించడం... ఇలా పలు కారణాలవల్ల పిల్లలు ఇంగ్లీషులో పట్టు సాధించలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో పిల్లలు తమ మాతృభాషను కూడా సరిగా నేర్చుకోలేకున్నారు. అలాకాకుండా మాతృభాషలో చక్కటి ప్రావీణ్యం కలిగివుంటే ఇంగ్లీషు నేర్చుకోవడం వారికి చాలా సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్రిటిష్ కౌన్సిల్, ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా చేపట్టిన భారీస్థాయి అధ్యయనంలో ప్రాంతీయ భాషల్లో పిల్లలకున్న సామర్ధ్యం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వారు ఇంగ్లీషు నేర్చుకునే సమయంలో బాగా ఉపకరిస్తుందని తేలింది.
బ్రిటిష్ కౌన్సిల్, ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థలు కలిసి 'గ్రామీణ భారతదేశంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఆంగ్ల భాషాధ్యయన ఫలితాలు' అనే అంశంపై అధ్యయనాన్ని జరిపాయి. ఈ అధ్యయనంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆరులక్షల మంది చిన్నారులను అధ్యయనవేత్తలు ప్రశ్నించారు. ఇది మనదేశంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఇంగ్లీష్‌పై జరిగిన అతిపెద్ద అధ్యయనం. ఈ అధ్యయనంలో విడుదలైన ఫలితాలను బుధవారం నాడు లండన్‌లో విడుదల చేశారు.
ఈ ఫలితాలను గురించి ప్రథమ్ సంస్థకు చెందిన రుక్ష్మిణి బెనర్జీ మాట్లాడుతూ పలుభాషలకు నెలవైన భారతదేశంలో విద్యాభ్యాసం అనేది అత్యంత విస్తృతమైన కోణంలో జరగాలి. స్థానిక లేదా ప్రాంతీయ భాషలో చదువుకోవడం అంత ముఖ్యమైన విషయమని, ఒక భాషలో చిన్నారులకు మంచి అవగాహన, సామర్ధ్యం, ఆత్మవిశ్వాసం ఉంటే వేరొక భాషలో కూడా వారు అదేవిధమైన సామర్ధ్యాన్ని చూపగలరని తమ అధ్యయనంలో తేలిందని చెప్పారు. ఈ ఫలితాల నేపథ్యంలో మన బోధన, అధ్యయన పద్ధతులను పిల్లలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.