: సచిన్ 38..తొలిరోజు భారత్ 157/2


ముంబైలో వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి... భారత్ రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చివరి మ్యాచ్ కావడంతో స్టేడియం పూర్తి సామర్ధ్యంతో నిండిపోయింది. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య టీమిండియా ఘనంగా రెండో టెస్టును ప్రారంభించింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకుని ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించాడు. ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ పతనానికి షమి నాంది పలుకగా ఓజా, అశ్విన్ లు ముగింపు పలికారు.

విండీస్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 182 పరుగులకే ఆలౌటయింది. తరువాత భారీ స్కోరు లక్ష్యంగా టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు ధావన్(33), మురళీ విజయ్(44)లు పెవిలియన్ చేరడంతో బ్యాటింగ్ లెజెండ్ సచిన్ క్రీజులోకి వచ్చాడు.

తనదైన శైలిలో బంతిని బౌండరీ లైన్ దాటించిన సచిన్... ప్రపంచ టెస్టు క్రికెట్ లో అత్యధిక బౌండరీలు సాధించిన బ్యాట్స్ మన్ గా చరిత్ర పుటలకెక్కాడు. తరువాత ధాటిగా ఆడుతూ సచిన్ 38 పరుగులు సాధించగా, అతని సహచరుడు ఛటేశ్వర్ పుజారా 34 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మరో నాలుగు రోజుల ఆట మిగిలి ఉండగా భారత్ తొలి రోజే పైచేయి సాధించింది.

సచిన్ ఆటను చూసేందుకు సెలబ్రిటీలు, అభిమానులు స్టేడియంకి పోటెత్తారు. సచిన్ తల్లి అతని ఆటను ప్రత్యక్షంగా తిలకించేందుకు రావడం విశేషం.

  • Loading...

More Telugu News