: కాంగ్రెస్ తప్పు చేసిందని చంద్రబాబు అనడం సరికాదు: జానారెడ్డి
విభజన విషయంలో కాంగ్రెస్ తప్పు చేసిందని చంద్రబాబు చెప్పడం సరికాదని మంత్రి జానారెడ్డి అన్నారు. విభజనను వ్యతిరేకించే వారంతా.. ముందుగా వారి వద్దనున్న ప్రణాళికను చెప్పాలన్నారు. ఆర్టికల్-3 ప్రకారం విభజించాలన్న ఒక పార్టీ... ఇప్పుడు మాట మార్చిందని వైఎస్సార్సీపీపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకున్న సమయంలో, కొందరు భిన్న ప్రకటనలు చేస్తున్నారని జానారెడ్డి అన్నారు.
విభజన అనేది తండ్రి, ఇద్దరు అన్నదమ్ముల మధ్య వుండే సంబంధమని... కుటుంబ సభ్యులందరూ కలిసి అన్నదమ్ముల మధ్య విభేదాలను రూపుమాపాలన్నారు. అయితే, రాష్ట్రంలో నాయకత్వ మార్పును తాము కోరుకోవడం లేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా రేపు ఢిల్లీ వెళ్లి.. విభజనపై జీవోఎం సహా పార్టీ పెద్దలందరిని కలుస్తామని తెలిపారు. ఆంటోనీ కమిటీ సిఫార్సుల్లో తెలంగాణ ప్రాంత ప్రజలకు అంగీకారం లేని వాటిని తొలగించాలని కోరతామని జానారెడ్డి వెల్లడించారు.