: మతిమరుపు తగ్గాలంటే...
మతిమరుపు తగ్గడానికి చక్కని మందు ఒకటి పాటలు పాడడం, రెండు వ్యాయామం చేయడం. ఈ రెండు బాగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నవారు పాటలు పాడడం వల్ల వారి జ్ఞాపకశక్తి మెరుగయ్యే అవకాశాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
వర్జీనియాలోని జార్జ్ మేసన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో అల్జీమర్స్‌తో బాధపడేవారు పాటలు పాడడం వల్ల క్రమేణా మెదడు పనితీరు మెరుగవుతుందని తేలింది. వయోధికులు, మతిమరుపు ఉన్నవారు పాటలు పాడితే కాలక్రమేణా వారి జ్ఞాపకశక్తి మెరుగవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. తమ పరిశోధనలో భాగంగా మతిమరుపు బాధితులతో నాలుగు నెలల పాటు పాటలు పాడిస్తూ పరిశోధనలు చేసి ఈ విషయాన్ని గమనించారు. అలాగే ఏరోబిక్ ఎక్సర్‌సైజులు చేసినా కూడా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. వీరు 57 నుండి 75 ఏళ్ల వయసున్న వారిపై ఈ తరహా పరిశోధనలు చేసి ఏరోబిక్స్ చేయడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని కనుగొన్నారు.