: ముంబయిలోని క్యాంపాకోలాలో తీవ్ర ఉద్రిక్తత
ముంబైలోని క్యాంపాకోలా ప్రాంగణంలో నేడు కూడా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలను కూల్చివేసేందుకు వెళ్లిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగం సిద్దం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ముగియడంతో రెండు రోజులయినా క్యాంపోకోలా గృహ సముదాయ ప్రాంగణంలోకి వెళ్లలేకపోయారు. దీంతో పోలీసులు సహాయంతో కార్పొరేషన్ అధికారులు కాంపౌండ్ ప్రధాన ద్వారాన్ని కూల్చివేశారు.
బలవంతంగా భవనాలను కూల్చివేస్తున్నారు. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో స్థానికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యాంపాకోలా ప్రాంగణంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న 90 కుటుంబాలను ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చేసేందుకు చర్యలు ప్రారంభించారు.
దీనిపై ఈ ఉదయం స్పందించిన సుప్రీంకోర్టు క్యాంపాకోలా భవన సముదాయంలో ఉన్న అక్రమనిర్మాణాల్లో ఉన్న 90 కుటుంబాలకు 31 మే 2014 వరకు స్టే ఇస్తున్నట్టు తెలిపింది. ఆ లోపు వారంతా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది.