: సీమాంధ్రను పారిశ్రామికంగా అభివృద్ధి చేయగలరా? అని జీవోఎంను ప్రశ్నించాం : మంత్రి వట్టి


నిన్న జరిగిన భేటీలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జీవోఎంను కోరామని మంత్రి వట్టి వసంతకుమార్ తెలిపారు. నివేదికలో పేర్కొన్న 11 అంశాలను ఎలా పరిష్కరిస్తారని జీవోఎంను ప్రశ్నించామని అన్నారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, వట్టి వసంతకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ తరహా పరిశ్రమలను సీమాంధ్రకు ఎలా తెస్తారని అడిగామని చెప్పారు. హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వరంగ పరిశ్రమలను సీమాంధ్ర ప్రాంతంలో పెట్టగలరా? అని పశ్నించామని తెలిపారు. సీమాంధ్రను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం మీకు సాధ్యమేనా? అని సూటిగా అడిగామని చెప్పారు.

ఇప్పటికైనా విభజనపై వెనక్కు వెళ్లాలని జీవోఎంకు సూచించినట్టు వట్టి తెలిపారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని కోరామని అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే 60 శాతం ఆదాయాన్ని సీమాంధ్రకు ఇవ్వగలరా? అని అడిగినట్టు చెప్పారు. సీమాంధ్రలో కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి అవసరమైన ప్రతి రూపాయిని మీరు ఇవ్వగలుగుతారా? అని అడిగామని చెప్పారు.

విభజన జరిగితే జలయుద్ధాలు జరిగే అవకాశముందని జీవోఎంకు చెప్పామని వట్టి తెలిపారు. 1956కు ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలను పూర్వ స్థితికి తీసుకురావాలని కోరామని అన్నారు. అధికారులతో ఎన్ని కమిషన్లు వేసినా ప్రయోజనం లేదని సూచించామని తెలిపారు.

  • Loading...

More Telugu News