: విభజన వల్ల పరిష్కారంకన్నా సమస్యలే ఎక్కువ: రాఘవులు
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న పార్టీ మాటపై సీపీఎం నిలిచింది. ఇదే విషయాన్ని పార్టీ ఢిల్లీలో జీవోఎం ఎదుట స్పష్టం చేసింది. విభజన వల్ల పరిష్కారం కన్నా, తలెత్తే సమస్యలు ఎక్కువని మంత్రులకు చెప్పినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తెలిపారు. నాలుగేళ్లుగా అంశాన్ని నానబెట్టడం వల్ల పరిపాలన స్తంభించిందనీ, మంత్రివర్గం రెండు ముఠాలుగా విడిపోయిందని వివరించామన్నారు. అంతేకాక, విభజన నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి తొలగించాలని, శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర మంత్రుల బృందాన్ని కోరామన్నారు. ఢిల్లీలో భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాఘవులు.. జీవోఎంతో చర్చించిన కొన్ని విషయాలు చెప్పారు. రాష్ట్రాన్ని ఒకటిగా వుంచినా, విభజించినా వెనుకబడిపోయిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరినట్లు చెప్పారు. అయితే, తాము నాలుగు అంశాలను జీవోఎం ముందు ఉంచామన్నారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల కోసం కేంద్రం వెయ్యికోట్లు ఇవ్వాలని చెప్పామన్నారు.