: బరువు తగ్గాలంటే ఈ నూనె వాడండి
బరువు తగ్గాలంటే నూనె పదార్ధాలను తగ్గించాలని చెబుతారు కదా... మరి నూనె వాడమంటారేంటి? అని మీకు సందేహంగా ఉందా... మామూలు నూనెతో అయితే బరువు పెరగడం జరుగుతుంది. అలాకాకుండా మనకు ఎంతగానో మేలుచేసే కొబ్బరి నూనెతో అయితే బరువు పెరగడం అనేది జరగదు.
సాధారణంగా మనం కొబ్బరి నూనెను తలకు పట్టించడానికి వాడుతాం. జుట్టు బలంగా పెరగాలని నూనె పెడుతుంటాం. అదే నూనెతో తయారుచేసిన వంటకాలను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందట. కొబ్బరి నూనెతో వండిన వంటకాలు తినడం వల్ల జీవక్రియలు వేగవంతంగా జరుగుతాయి. ఫలితంగా శరీరంలోని కొవ్వు కూడా వేగంగా కరుగుతుంది. మన శరీర బరువును తగ్గించడంలో కొబ్బరినూనె కీలక పాత్ర పోషిస్తుందట. ఈ నూనెతో తయారుచేసిన వంటకాలు త్వరగా జీర్ణమవుతాయి. శరీర ఆరోగ్యానికే కాకుండా మానసిక ఒత్తిడినుండి బయటపడేయడంలో కూడా కొబ్బరినూనె ఉపకరిస్తుంది. శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. హానికారక బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడుతుంది.
యాంటీబ్యాక్టీరియా, యాంటీ మైక్రోబయల్ లిపిడ్స్, క్యాప్పిక్, క్యాప్రిలిక్, లౌరిక్ ఆమ్లాలను కొబ్బరినూనె కలిగివుంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని స్థిరపరుస్తుంది. కాబట్టి షుగరువ్యాధిగ్రస్థులకు ఇది చక్కగా పనిచేస్తుంది. గుండెకు హాని కలిగించే కొలెస్టరాల్ పెరగకుండా గుండెకు మేలు చేస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. ఈ నూనెలో ఉండేవి శాచ్యురేటెడ్ కొవ్వులు కావడం వల్ల ఎలాంటి హాని ఉండదు. చర్మ గాయాలపై దుమ్ము పడకుండా చేసి, ఈ గాయాల వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా రక్షణ కవచంలా కొబ్బరి నూనె పనిచేస్తుందట.