: అక్కడ అమ్మాయే కుటుంబానికి పెద్ద దిక్కు


ఆడబిడ్డలు పుట్టడం కన్నా మగబిడ్డ పుడితే బాగుంటుందని, మగబిడ్డ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటాడని మనం అనుకుంటాం. కొడుకుల కోసం కోటి దేవుళ్లకు మొక్కుకుంటారు కూడా. కొడుకును కనివ్వలేదని భార్యలను పుట్టింటికి పంపిన ఘనుల గురించి కూడా మనం రోజూ పేపర్లలో చూస్తుంటాం. కానీ అక్కడ మాత్రం కొడుకులు పుట్టలేదని కాదు, కూతుళ్లకోసం తల్లిదండ్రులు కోటి దేవుళ్లకు మొక్కుకుంటారట.

మన ప్రాంతాలలో పితృస్వామిక వ్యవస్థ వుంటుంది. మన దేశంలోని మేఘాలయ రాష్ట్రంలో ఖాసీ తెగకు చెందిన కుటుంబాల్లో ఎక్కువగా మాతృస్వామిక వ్యవస్థ కనిపిస్తుంది. ఇక్కడ బారసాల నుండి శవయాత్ర వరకూ అన్ని విషయాల్లోనూ ఆడవారికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో ఆడబిడ్డ పుట్టగానే ఇంటికి పెద్ద దిక్కు పుట్టిందని ఆనందంగా సంబరాలు చేసుకుంటారట. వరుసగా అబ్బాయిలు పుడుతుంటే తర్వాతైనా అమ్మాయి పుట్టకపోతుందా? అని తల్లిదండ్రులు ఎదురుచూస్తారట. కీలకమైన ఆర్ధిక వ్యవహారాలన్నీ కూడా ఆడవారి చేతుల మీదుగా సాగుతాయి. అలాగే ఆస్తి వ్యవహారాలకు సంబంధించి, ఆస్తి మొత్తం తల్లినుండి కూతురికి సంక్రమిస్తుంది.

పెళ్లి విషయంలో కూడా ఫలానా అమ్మాయి నచ్చిందని అబ్బాయి చెబితే, ఆ అమ్మాయి తన కొడుక్కి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటుందా? అని ఆరాతీసి తల్లులు తమ కొడుక్కి పెళ్లిచేస్తారట. పెళ్లయిన తర్వాత భార్య ఇంటికి అబ్బాయి వచ్చేస్తాడు. అంతేకాదు భర్త ఇంటిపేరు కూడా మారిపోయి భార్య ఇంటిపేరుతో చలామణీ అవుతాడు. ఇక్కడ మహిళలకోసం స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నట్టుగానే అక్కడ మగవారి రక్షణకోసం స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తాయట. ఒకవేళ పెళ్లికాకుండా మగవారు మిగిలిపోతే వారు అక్క ఇంట్లోనో, లేదా పుట్టింటిలోనో ఉండిపోవాల్సిందేనట. మగవారు చేసే ప్రధానమైన పనులేవంటే పశువుల్ని మేపడం, పిల్లలను పెంచడం. ఇతర పొలం పనులన్నింటినీ ఆడవారే చూసుకుంటారట. మగువలకు ఇంత ప్రాధాన్యతనిస్తున్న ఖాసీ తెగ నిజంగా గొప్పదే!

  • Loading...

More Telugu News