: ఫోన్లో మాట్లాడే సమయం తగ్గిస్తే చాలు
కొందరు ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటే ఇక అంతే... ఎంతసేపు మాట్లాడుతున్నారో కూడా మరచిపోతారు. ఒకటే కబుర్లు. దీనికితోడు కంపెనీలు పలు రకాల ఆఫర్లను ఇవ్వడం వల్ల బిల్లు కూడా తక్కువగా పడడంతో ఇక అంతు లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. ఇలా గంటల తరబడి ఫోనులో మాట్లాడడం వల్ల రేడియేషన్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. సెల్‌టవర్ల నుండి వెలువడే రేడియేషన్ ఆరోగ్యానికి ముప్పు అని అందరూ భావిస్తున్న నేపథ్యంలో టవర్లకన్నా చెవి దగ్గరనుండి ఎక్కువ సేపు తీయకుండా ఫోనులో మాట్లాడడం వల్లనే మనం ఎక్కువగా రేడియేషన్ ప్రభావానికి గురవుతామని డబ్ల్యుహెచ్‌వో హెచ్చరిస్తోంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా సెల్ టవర్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. వీటివల్ల రేడియేషన్ ప్రభావం ఎక్కువయ్యే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. అయితే వీటివల్ల ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సెల్ టవర్లకన్నా మొబైల్ ఫోన్లనుండి వచ్చే రేడియో ఫ్రీక్వెన్సీ తీవ్రత మనపై వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుందని, కాబట్టి సెల్లులో మాట్లాడే సమయాన్ని తగ్గిస్తే సరిపోతుందని డబ్ల్యుహెచ్‌వో సూచించింది. సెల్‌ఫోన్లు, సెల్ టవర్లనుండి వెలువడే రేడియేషన్ పరిధి, అది ఆరోగ్యంపై చూపే ప్రభావంపై నిర్వహించిన పరిశోధనకు సంబంధించిన నివేదికలో డబ్ల్యుహెచ్‌వో ఈ మేరకు వెల్లడించింది.