: సాఫ్ట్ వేర్ మహిళలకు మద్దతుగా సానియా మీర్జా లఘు చిత్రం
కొన్ని నెలల కిందట రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సాఫ్ట్ వేర్ మహిళలపై అకృత్యాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాదులోని 'మాదాపూర్-గచ్చిబౌలి' ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న యువతులకు భరోసా ఇచ్చేందుకు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఓ లఘు చిత్రంలో నటించబోతోంది. కొన్ని ఐటీ కంపెనీలతో కలిసి సైబరాబాద్ పోలీసులు ఈ లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో సానియాతో పాటు కొంతమంది టాలీవుడ్ నటులు నటిస్తారని సమాచారం. మహిళల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళల పట్ల గౌరవంపై పలు సూచనలు ఇస్తారు. దీనిపై సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ను సంప్రదించగా.. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పని జరుగుతోందన్నారు. సానియా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. త్వరలో చిత్రాన్ని పూర్తిచేసి విడుదల చేస్తామని తెలిపారు.