: సినీ దర్శకుడినంటూ వివాహితను వంచించిన ఘనుడు
సినీ దర్శకుడినని పోజులు కొడుతూ, ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి, డబ్బు దండుకుని ఓ వివాహితను మోసం చేసాడో మోసగాడు. తనను వంచించిన మోసగాడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ మహిళ హైదరాబాదు, బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మహిళ(29)కి గతంలో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నాలుగేళ్ల క్రితం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని గౌరీ శంకర్ కాలనీవాసి బత్తుల దైవకృపరాజు(32)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. తాను సినీదర్శకుడ్నని, ప్రేమిస్తున్నానంటూ ఆమెను వలలో వేసుకున్నాడు రాజు.
దీంతో భర్తకు విడాకులిచ్చి 2009 జనవరి 21న రాజును విజయవాడ దుర్గగుడిలో పెళ్లి చేసుకుంది. తరువాత తాను ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానంటూ ఆమె నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశాడు. తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో తాను ఇంకో పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి, జూలై నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు రాజు. తరువాత అతని సెల్ కు కాల్ చేస్తే అందుబాటులోకి రావడంలేదు.
ఎంతకూ అతను తిరిగిరాకపోవడంతో అతని గురించి ఆరా తీయగా అతను డ్రైవర్ అని తేలింది. దీంతో రాజు తనను మోసం చేసి పరారయ్యాడని గ్రహించిన బాధితురాలు ఆదివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రేమ, పెళ్లి పేరుతో తన వంచించిన రాజుపై చీటింగ్ కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.