: అందానికి ఉపకరించే నువ్వులు
నువ్వులు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చక్కగా ఉపకరిస్తాయి. నువ్వుల నూనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. నువ్వుల నూనె ముఖానికి రాసుకుని చక్కగా మర్దన చేసిన తర్వాత సెనగపిండితో నలుగులా పెట్టుకుని గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. కొద్దిసేపైన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కుంటే తెరుచుకున్న చర్మగ్రంధులు చక్కగా మూసుకుంటాయి.
పాదాలు చలికాలంలో పగిలి ఇబ్బందిని కలిగిస్తుంటాయి. ఇలాంటి సమయంలో పాదాలకు నువ్వులనూనె రాసుకుని సాక్సులు వేసుకుంటే కాలి పగుళ్లు త్వరగా తగ్గుతాయి. నువ్వుల నూనెలో ఉండే ఒమెగా త్రీ, సిక్స్, నైన్ ఫ్యాటీ ఆమ్లాలు జుట్టుకు మంచి పోషణనిస్తాయి. గోరు వెచ్చని నువ్వుల నూనెను తలకు మర్దన చేసుకోవడం వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఫలితంగా జుట్టు కుదుళ్లు కూడా గట్టిపడతాయి. దీనివల్ల జుట్టు పొడిబారడం, జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. నువ్వుల నూనెతో ఎంత మేలు కలుగుతుందో తెలిసిందిగా. చక్కగా నువ్వుల నూనెను ఉపయోగించి ఇలాంటి సమస్యలను తొలగించుకోండి.