: 2013 పద్మ అవార్డుల ఎంపికపై వివాదాలు
దేశ అత్యున్నత పద్మ అవార్డుల ఎంపికపై అనుమానాలు ముసురుకున్నాయి. ఈ ఏడాది అవార్డుల కోసం వచ్చిన సిఫార్సుల జాబితాలో అన్నీ బంధు పక్షపాతం, పైరవీలు ఉన్నాయని తెలిసింది. ఇలా చాలా పేర్లకు ప్రముఖులు సిఫార్సు చేసినట్లు బయటికొచ్చింది. అలా కేంద్ర హోంశాఖకు 1300 ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ప్రముఖ నటి, ఎంపీ జయప్రద కోసం ఆమె సన్నిహితుడు, సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ సిఫారసు చేస్తూ హోంశాఖకు లేఖ కూడా రాశారని తెలిసింది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత మోతిలాల్ వోరా, కేంద్రమంత్రి రాజీవ్ శుక్లా, ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి కూడా పలువురి పేర్లను ప్రతిపాదించారట. భారతరత్న అవార్డు గ్రహీత, ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ తన సోదరి ఉషా మంగేష్కర్, మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేశారని తెలిసింది. పద్మవిభూషణ్ ఉస్తాద్ అంజాద్ అలీ ఏకంగా తన కుమారులు అమాన్, అయాన్ తో పాటు మరో ఆరుగురి పేర్లను ప్రతిపాదించారని వెల్లడైంది.