: భారత్ ను 'ప్రతికూల దేశం'గానే పరిగణిస్తోన్న పాక్
'అత్యంత అనుకూల దేశం' హోదాను భారత్ కు తామింకా ఇవ్వలేదని పాకిస్తాన్ మంత్రి అబ్బాస్ ఖాన్ అఫ్రిది వెల్లడించారు. వ్యాపార సంబంధాల పరంగా కూడా భారత్ ను వ్యతిరేక దేశంగానే పరిగణిస్తున్నామని ఆయన తెలిపారు. పార్లమెంటు దిగువ సభలో ఈ రోజు జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఈ విషయాలు చెప్పారు.
కాగా, క్యాబినెట్ ఆమోద ముద్ర వేస్తేనే భారత్ ను ప్రతికూల దేశాల జాబితా నుంచి తొలగిస్తామని అఫ్రిది పేర్కొన్నారు. అయితే, వచ్చే మే నెల్లో పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అవి ముగిసిన అనంతరం భారత్ కు 'అత్యంత అనుకూల దేశం' హోదాను ఇచ్చే అవకాశం ఉందని పాక్ వర్గాలు అంటున్నాయి. అయితే, భారత్ కు ఆ ప్రతిష్ఠాత్మక హోదా ఇవ్వకపోవడానికి జమాత్-ఉద్-దవా, దెఫా-ఈ-పాకిస్తాన్ కౌన్సిల్ వంటి అతివాద, వ్యాపార సంస్థల లాబీయింగ్ కారణమని తెలుస్తోంది.