: అశ్విన్ ఆల్ రౌండర్ గా ఎదుగుతాడా?
ఆల్ రౌండర్ ఈ పదానికి టీమిండియా కపిల్ దేవ్ రిటైర్మెంట్ తరువాత సరైన అర్ధం కోసం తీవ్రంగా వెతికింది. కపిల్ తరువాత మనోజ్ ప్రభాకర్, రాబిన్ సింగ్, అజయ్ జడేజా, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి వారంతా పోటీ పడ్డా యువరాజ్ బ్యాట్స్ మన్ గానే గుర్తింపు పొందాడు తప్ప నిఖార్సైన ఆల్ రౌండర్ అని ఎవరూ అనిపించుకోలేకపోయారు. తాజా యువ స్పిన్ సంచలనం రవిచంద్రన్ అశ్విన్ ఆల్ రౌండర్ అనిపించుకోనున్నాడా అంటే అవుననే అంటున్నారు క్రికెట్ పండితులు.
విండీస్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయబావుటా ఎగురవేసిందంటే కారణం అశ్వినే. అయితే అశ్విన్ ప్రతిభ రోహిత్, షమిల ప్రదర్శన ముందు గుర్తింపుకు నోచుకోలేదు. అరంగేట్రంలోనే వారిద్దరూ అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించడంతో అశ్విన్ ఘనత ఎవరూ పట్టించుకోలేదు. 156/6 దశలో బ్యాటింగ్ కు దిగిన అశ్విన్ మొక్కవోని పట్టుదలతో దిగ్గజ ఆటగాళ్లలా టెయిలెండర్లు చూపే బెరుకు లేకుండా సెంచరీ సాధించాడు. ఒకానొక దశలో రోహిత్ శర్మ కంటే అశ్వినే విండీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు.
అయితే అశ్విన్(124) కంటే రోహిత్(177) ఎక్కువ పరుగులు చేయడంతో పాటు, బౌలింగ్ లో అశ్విన్(5) కంటే షమి(9) వికెట్లు తీయడంతో అశ్విన్ ప్రతిభ వెలికి రాకుండా పోయింది. అయితే క్రీడా పండితులు మాత్రం అశ్విన్ కు వరల్డ్ కప్ లోపు బ్యాటింగ్ లో అవకాశాలు ఇస్తే నిఖార్సయిన ఆల్ రౌండర్ గా నిరూపించుకునే అవకాశముందని అంటున్నారు. తొలుత అశ్విన్ ఒపెనర్ గా కెరీర్ ఆరంభించడం విశేషం.