: ఈడెన్ లో సచిన్ కు ఘన సత్కారం
ఈడెన్ గార్డెన్స్ తన ముద్దుల బిడ్డకు ఘనంగా వీడ్కోలు పలికింది. భారత క్రికెట్ లో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన ఈడెన్ గార్డెన్స్ భరతమాత ముద్దుబిడ్డ సచిన్ టెండూల్కర్ కు అతని క్రీడా జీవితంలో ఎన్నో మధుర స్మృతులను ఇచ్చింది. పేలవ ఫాంతో ఇబ్బంది పడ్డ ప్రతిసారీ సచిన్ ను అక్కున చేర్చుకుంది ఈడెన్ గార్డెన్స్. ఓ మెరుగైన ఇన్నింగ్స్ తో తరువాతి సమరానికి సచిన్ సిద్ధమయ్యేవాడు. ఈడెన్ లో సచిన్ రెండు టెస్టు సెంచరీలతో పాటు, 6 అర్థశతకాలు కూడా బాదాడు. వన్డేలలో ఈడెన్ లో సచిన్ ది మెరుగైన రికార్డే.
కాగా సచిన్ తమకు అందించిన వినోదానికి, దేశ క్రికెట్ కి చేసిన సేవలకు గుర్తుగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. సచిన్ కు శాలువ కప్పి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సత్కరించి సచిన్ బొమ్మతో ఉన్న టాస్ వేసిన బంగారు నాణేన్ని సచిన్ కి అందజేశారు. బంగారు ఆకులతో నిండిన వెండి చెట్టు జ్ఞాపికను సచిన్ కు దీదీ అందజేశారు. సౌరవ్ గంగూలీ తన సహచర మిత్రుడికి టోపీ బహూకరించి ఆత్మీయ ఆలింగనంతో వీడ్కోలు పలికాడు.
బెంగాల్ అసోసియేషన్ చిత్రపటాన్ని అందజేసి ఘనంగా సత్కరించింది. కోల్ కతా పోలీసు విభాగం కూడా సచిన్ ను జ్ఞాపికతో సత్కరించింది. సచిన్ కు లభించిన సత్కారాన్ని భారత, వెస్టిండీస్ క్రికెటర్లు ఆస్వాదించారు. చివరి సారిగా స్టేడియం మొత్తం కలియదిరిగి అభిమానులకు సచిన్ కృతజ్ఞతలు తెలిపాడు.